తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల నుంచి తబ్లిగీ జమాత్ కార్యకర్తలు హాజరైనట్లు వెలుగులోకి రావడం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఎప్పుడు, ఏ మూల నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందేమోనని ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమావేశాలకు వెళ్లొచ్చిన వారి కారణంగా గత రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో కేసులు అనూహ్యంగా పెరిగాయి. గురువారం (ఏప్రిల్ 2) రాత్రికి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 154కు చేరగా.. ఏపీలో 149కి చేరాయి. ఇంకా 1500 మంది వరకు నమూనాల రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మర్కజ్ మూలాలున్న వ్యక్తుల విషయం చెబితేనే జనం వణికిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన దంపతులు హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఓ వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటూ ప్రైవేట్ కంపెనీలలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కట్టడి కోసం మార్చి 22 నుంచి కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధించడంతో అద్దె ఇంట్లోనే ఉండిపోయారు. ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడంతో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న తరుణంలో నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల ఉదంతం బాంబ్ పేల్చినట్లయింది. తెలంగాణ నుంచి ఈ సమావేశాలకు 1030 మందికి పైగా వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అణువణువూ జల్లెడ పడుతూ వారిని ఆస్పత్రులకు తరలించారు. వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.