హోం క్వారంటైన్‌లో ఉన్న ఓ వ్యక్తి క్వారంటైన్ ముగుస్తుందన్న చివరి రోజున మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలానికి కారణమైంది. కరోనా మహమ్మారి కారణంగానే అతడు మరణించాడని గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు అతడి అంత్యక్రియలను కరోనాతో మృతి చెందిన వ్యక్తులకు చేసినట్లుగానే పూర్తి చేయడం ఈ ఆందోళనకు మరింత ఆజ్యం పోసింది.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన 48 ఏళ్ల ఓ వ్యక్తి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో మార్చి 23న స్వగ్రామమైన కంజర్‌కు తిరిగి వచ్చాడు. అతడు గ్రామానికి చేరుకున్నాడనే విషయం తెలుసుకున్న అధికారులు అతడి ఇంటికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. నాటి నుంచి వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు రోజూ వచ్చి అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.